Sunday, 19 May 2013

గిజిగాడు -2
19 May 2013
అనకాపల్లి

గిజిగాడు పక్షులను నేను మొదటిసారి చూసి ఇరవై రోజులు గడిచింది. ఏం చేస్తున్నాయో చూద్దామని  ఈ రోజు మళ్ళీ వెళ్లాను. 

(ఫోటో మీద క్లిక్ చేస్తే ఫోటో ఫుల్ సైజ్ లో చూడొచ్చు )
క్రితంసారి సగం అల్లిన గూళ్ళ మధ్య మగ పక్షులైతే ఈ సారి ఆడ పక్షుల హడావుడి కనిపించింది. ఫోటోలో కనిపిస్తున్నవన్నీ  ఆడవే ....  


ఇక నుండి గూడు పిల్లల బాధ్యత ఆడ పక్షులదిలా ఉంది. అప్పుడో ఇప్పుడో తప్ప మగ పక్షుల జాడ కనబడలేదు. లోపల పిల్లలున్న అలికిడి వినిపించింది ఈ గూటి నుండి                                 


 ఆహారం పట్టుకోస్తోంది ఓ అమ్మ. 

                                                              


గడ్డి పోచలు ముక్కున కరుచుకుని రయ్యిన ఎగురుతూ వచ్చి వాలిన గిజిగాడిని చూశాను.. 


 మొన్నటి వానకు కరెంటు తీగ తెగి పడి  దాన్ని అల్లుకున్న అక్కరకు రాకుండా పోతే తిరిగి గూడుని అల్లుతున్న పనిలో ఉంది ఈ గిజిగాడు..మెప్పించలేకపోతే ఎన్ని గూళ్ళయినా అల్లుతుందట మగ గిజిగాడు. అలాంటి ప్రయత్నం ఏదైనా అయుండాలి లేదా.....  

పచ్చని కాపురానికై ఓ పచ్చని ఇల్లు సిద్దం!                                                   అల్లడం పూర్తయిన గూళ్ళు                                                                

బంక మన్ను తెచ్చి గూటి లోపలి వైపు అతికిస్తాయి గిజిగాళ్ళు. గాలికి గూడు ఎక్కువగా ఊగాకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు. (ఫోటోలో చూడొచ్చు) 
గుంపులుగా ఎదురు దాడి చేసి తరిమేసి శత్రువుల నుండి గూడునూ పిల్లల్ని కాపాడుకోవడం, పిల్లలకు ఆహారం తెచ్చే పట్టే బాధ్యత అప్పుడప్పుడూ పంచుకోవడం  తప్ప ఇక పెద్దగా పనిలేనట్టే ఉంటుంది మగ గిజిగాడుకి. 

Tuesday, 14 May 2013

గిజిగాడు


Baya Weaver (Ploceus philippinus)


విశాఖ  జిల్లా అనకాపల్లి నుండి పూడిమడక అనే ఊరు ఓ రోజు బస్సులో వెళుతుండగా రోడ్డు పక్కన చెరుకు తోటలో కరెంటు తీగలను అల్లుకున్న ఈ 'పిచ్చుక గూళ్ళని' చూశాను. చెరువులోకి వంగిన తుమ్మ కొమ్మలకో, తాటి లేదా ఈత చెట్టుకో వేలాడుతున్న గూళ్ళను చూశాను. కానిలా కరెంటు తీగెలను అల్లుకున్న గూళ్ళను చూడడం ఇదే మొదటిసారి. పాములూ , ఇతర శత్రువుల బారినుండి గుడ్లనూ, పిల్లల్నీ కాపాడుకోడానికి గూళ్ళను ఇలా కట్టుకుంటాయట ఓ రకం పిచ్చుకలే అయిన గిజిగాళ్ళు. 

పదో ఇరవయ్యో కాదు, దాదాపు యాభై గూళ్ళు! దూరాన్నుండి ఓసారి తప్ప అసలు నేను  గిజిగాడిని దగ్గరగా చూసింది లేదు. బుల్లి ఇంజనీర్ల నేర్పరి తనమూ కళ్ళారా చూడగలిగితే!  కల నిజమైనట్టే.... గూళ్ళు అల్లడమూ, పిల్లలకి ఆహారం నోటికందించడమూ, శత్రువులను ఎదుర్కోవడమూ, ఆటలూ పాటలూ చాలా చూడొచ్చనిపించింది అక్కడిదాకా వెళితే.  నేనూహించింది నిజమే అయింది. నేను అక్కడికి వెళ్లేసరికి గూళ్ళలో  గోల గోలగా బుల్లి పిట్టలూ ఉన్నాయినింగికీ నేలకీ మధ్య వేలాడదీసిన గదులున్న చిన్న గృహాలు! 'ఎంచక్కా ఉయ్యాల ఊగుతుంటాయేమో.'  అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. నన్ను గమనిస్తే ఎగిరిపోతాయని అలికిడి కాకుండా వెళ్లి గూళ్ళున్న చోటుకి వీలయినంత దగ్గరలో చెరుకు తోట గట్టు మీద కూర్చుని కెమెరా సిద్దం చెసుకుంటున్నాను. అరుస్తూ ఒక్కసారిగా లేచి దూరంగా తీగలమీద వాలాయి పక్షులన్నీ. పాముల బెడద లేనట్టే గాని కాకుల నుండి తప్పినట్టు లేదు. మరో పక్షేదో కూడా సందు చూసుకుని దాడి మొదలు పెట్టింది. కాకీ, ఈ పక్షీ గూడు గూడునీ వెతుకుతున్నాయి. దూరంగా తీగెల మీద చూస్తూ ఊరుకున్నాయేమిటా గిజిగాళ్ళు అనుకున్నా. గూళ్ళన్నీ ఖాళీ అని మెల్లిగా అర్ధమైంది. దాదాపు అన్ని గూళ్ళు సగం అల్లబడినవే  ఉన్నాయి అక్కడ. చిట్ చిట్ చీ ........ చిట్ చిట్ చీ ( Chit ..chit ..cheeeeee) అరుస్తూ, కాకటు పోగానే తిరిగొచ్చి వాలాయి పక్షులన్నీ. తల మీద పసిడి కిరీటం అన్నట్లు పసుపు రంగు, గడ్డమూ  ముక్కూ నలుపు రంగు, రెక్కలేమో గోధుమా నలుపు రంగు చారలతో అక్కడ నాకు కనిపించినవన్నీ మగ పక్షులే. ఆడ పక్షి ఒక్కటి కనిపిస్తే ఫోటో తీద్దామని చూశాను చాలాసేపు.  ఒకటో రెండు  సార్లు వచ్చి వాలిన ఆడపక్షుల్ని తరిమేసాయి మగ పక్షులు నేను ఫోటో క్లిక్ చేయకముందే.. ఆడ పక్షికి పసుపూ కిరీటమూ   ముఖం మీద నలుపూ  లేవు. ఊర పిచ్చుకల్లాగానే!

                   గర్వంగా గూటిని ప్రదర్శనకి పెట్టి రెక్కలు ఆడిస్తూ సంకేతాలు పంపుతున్న గిజిగాడు 
 పిల్లల్ని పోషించడం బాధ్యత   ఆడ పక్షులదైతే గూళ్ళు కట్టే పని పూర్తిగా మగ పక్షులదేనట. వరి ఇతర గడ్డి మొక్కల ఆకుల నుండి చీల్చుకొచ్చిన పోచలతోఅల్లుతాయి  గూడుని. సగం అల్లిన గూడుని ప్రదర్శనకి పెట్టి రెక్కలు ఆడిస్తూ సంకేతాలు అందిస్తుంది మగపక్షి  ఆడపక్షులకు  వచ్చి చూసుకొమ్మన్నట్లు. గుంపులో ఒక్క ఆడ పక్షైనా మెచ్చక పోదు కదా! తన గూటిని ఎవరూ మెచ్చలేదా అది వదిలి మరో గూడు అల్లడం మొదలు పెడుతుందట మగ పక్షి.  నచ్చిందా గొట్టం లాంటి ప్రవేశ ద్వారం వంటి మిగతా పనులు పూర్తి చేయడంతో కాపురానికి అందమైన గూడు సిద్దమవుతుంది!  


పది పోచలున్న గూడు గాలికి చోటు మారినట్టుంది. తెలిసిపోయిందేమో! గూడులో ఓ పోచని ముక్కుతో పట్టుకుని లాగి యదా స్థానంలో చేర్చుకుందో పక్షి. అవతల మూడు పిట్టలేందుకో అదే పనిగా గొడవ పడుతున్నాయి.  పక్క గూళ్ళ నుండి గడ్డిపోచలు దొంగిలించడమూ జరుగుతుంది. కొన్ని గూళ్ళు ఇంకా పచ్చిగా (పచ్చగా) ఉన్నాయి.  ఊరికే తీగల మీద వాలి జరుగుతున్నవి చూస్తున్నాయి కొన్ని. గూడు చుట్టూ చుట్టూ ఎగురుతూ పనితనాన్ని సరిచూసుకుంటున్నాయి కొన్ని. ఊగి చూసి ద్రుడత్వాన్నీ పరీక్షించుకుంటున్నట్లున్నాయి మరి  కొన్ని  ఆడ పక్షిని మెప్పించాలిగా! 


         గూడు గాలికి నెట్టబడింది కాస్త దూరం. తిరిగి పూర్వపు చోటుకి జరుపుకుంటోంది. 
గొడవేమిటో!


ఈ ఫోటోలో ఎడమ వైపు ఉన్నది ఆడ పక్షి. గూడుని పరీక్షించుకుంటున్నట్లే ఉంది 


పదుల సంఖ్యలో పక్షులు ఒక గుంపుగా ఉండే గిజిగాళ్ళు పంటలను కాజేస్తుంటాయి. ఆహారం కోసమైతేనేమి, గూడుకి కావలసిన పోచల కోసమైతేనేమి వరి ఇతర చిరుదాన్యాల పంటలున్న చోటుని నివాసానికి ఎంచుకుంటాయి.  వీటి వల్ల మన పంటలకు అంతా నష్టమే జరుగుతుంది అనుకోలేము. పురుగులనీ తింటుంటాయి కాబట్టి మరో విధంగా పంటలకు మేలు చేస్తున్నట్లే. మరి కొంత తెలుసుకోవచ్చని ఈ రోజు పొద్దున్నే వెళ్లాను అదే చోటుకి. 10 రోజుల క్రితం సగం నిర్మాణం లో ఉన్న గూళ్ళు ఈ రోజు చూస్తే పూర్తయినట్లున్నాయి. గాలికో, వానకో మరి కరెంటు తీగలు తెగి పడున్నాయి. క్రితం సారి చూసిన గూళ్ళలో కొన్ని, కరెంటు తీగలతో సహా నేలరాలి కనిపించాయి. కరెంటు వల్ల ప్రమాదం దగ్గరికి వెళ్ళకండీ అన్నాడు చెరుకు తోట యజమాని. ఫోటోలు తీయలేకపోయాను అందుకే. పక్షులేమి చేస్తున్నాయా అని చూసాను దూరంగా నిలబడి. గడ్డి పోచలు సేకరించుకుని అదే కరెంటు తీగల వైపు ఎగురుతూ కనిపించాయి కొన్ని పక్షులు!!  

Monday, 18 February 2013

జెముడు కాకి

డిగు డిగు పిట్ట అని పిలిచేవాళ్ళము చిన్నప్పుడు. ఈ కొమ్మ మీదోటి మరో చెట్టు కొమ్మ మీదోటి దూరానెక్కడో ఓ చెట్టు మీద మరొకటి.. ఇక్కడిది డిగు డిగు మని అరుస్తుంటే అవి ప్రతిస్పందిస్తూ. అక్కడోటి అరుస్తే ఇది సమాధానం చెబుతున్నట్టు.. అసలేం మాట్లాడుకుంటున్నాయా అని అర్ధం చేసుకునే ప్రయత్నం అప్పుడే! 

                 Greater Coucal (Centropus sinensis)


ఇక్కడ మేముంటున్న చోట (ఛత్తీస్ ఘడ్, కొరియా జిల్లా) జెముడు కాకుల్ని చూసినట్లు గుర్తులేదుగాని మా ఇంటి (కరీంనగర్ జిల్లా) ఎదురుగా వేప చెట్టు మీద వాలే జెముడు కాకుల కోసం రోజూ మధ్యాహ్నం మూడయ్యిందంటే ఎదురు చూస్తూ ఉంటాను. బెదురు ఎరుపు కళ్ళు ఉండి ఆడ మగా జెముదుకాకులు ఒకేలా కనిపిస్తాయి. ఒకదానికన్నా ఒకటి కాస్త పెద్దగా అనిపిస్తే అది ఆడ జెముడు కాకి అని పోల్చుకోవచ్చు. జీవితకాలమంతా ఒకే పక్షితో జతకడతాయట జెముడు కాకులు. 


కొమ్మల మీద గెంతడమే గాని అంతగా ఎగరని జెముడుకాకి ఎగిరితే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది దాని రాగి రంగు రెక్కల్ని.  చాలా బాగుంటుంది. పురుగుల కోసం గాలిస్తూ తరచుగా నెల మీద నడుస్తూ కనిపిస్తుంటుంది. అప్పుడప్పుడూ ఇతర పక్షుల గుడ్లనూ కాజేస్తుంది జెముడు కాకి! చిన్న పాములు, నత్తలు లాంటివి కూడా జెముడు కాకికి ఆహారమవుతుంటాయి.

జెముడు కాకుల్ని చమురు కాకులు అని కూడా అంటుంటారు. మీరు కూడానా?!Tuesday, 5 February 2013

ఇండియన్ సిల్వర్ బిల్ఇండియన్ సిల్వర్ బిల్ /(Lonchura malabarica). వైట్ థ్రొటెడ్ మునియా అని కూడా అంటారు. మా ఊరి చెరువు దగ్గర చూస్తుంటాను ఈ చిన్న పక్షుల్ని. చెరువులోకి వొంగిన తుమ్మచెట్టు కొమ్మలకున్న గిజిగాడు గూటిలో కదలికలు గమనించినప్పుడు మొదట గిజిగాడని అనుకున్నాను.. దగ్గరగా వెళ్లి చూసాక తెలిసింది గిజిగాడు (Baya  Weaver bird) వదిలి వెళ్ళిపోగా ఆ గూటిని తనది చేసుకుంటున్న ఇండియన్ సిల్వర్ బిల్ అని. ఎక్కడినుండో తెచ్చిన గడ్డి పోచలు గూటిలోపలికి  చేరవేస్తుంది. 
ఎత్తు తక్కువున్న పొదల్లో, తుమ్మ చెట్ల కొమ్మల్లో ముళ్ళను రక్షణగా చేసుకుని గజి బిజీ గూళ్ళు పెట్టుకునే ఇవి తరచుగా గిజిగాడు గూళ్ళలో కనిపిస్తాయి. నాలుగు నుండి ఎనిమిది వరకూ గుడ్లు పెడతాయి. గుడ్లు పొదగడానికి పట్టే సమయం పదకొండు రోజులు. సిల్వర్ బిల్స్ గుంపులుగా కనిపిస్తుంటాయి . ఒకో గుంపులో అరవై వరకూ ఉండొచ్చు. పంట పొలాల్లో, గడ్డి భూముల్లో విత్తనాలు ఏరుకుని తింటున్న సిల్వర్ బిల్స్ ని చూస్తుంటాను.

Saturday, 2 February 2013

పాలపిట్ట

నిన్న ఒకేసారి రెండు పాలపిట్టల్ని చూసానొక చెట్టు మీద. ఒకటి మరోదాని దగ్గరికొచ్చే ప్రయత్నం చేస్తుంది. చిక్కకుండా ఎగిరి పోతుంది మొదటిది. మరో చెట్టు మీద వాలుతుంది. అటునుండి రెండూ ఈ చెట్టు పైకి.  మామూలుగానైతే పాలపిట్టను దగ్గరగా చూసే అవకాశం అరుదుగా వస్తుంది. కాని నిన్న అలా జరగలేదు. చూడటమే కాదు  దగ్గరగా ఫోటో తీసే అవకాశం కూడా వచ్చిందనుకున్నాను. నేను దాన్నే ఫోకస్ చేయడం గమనించింది అనుకుంటాను, అసహనంగా కూడా ఉన్నట్లనిపించాయి రెండూ. అందులో ఒకటి  మొత్తం ఆరుసార్లు  అరుస్తూ నన్ను గురి చేసుకుని నా తల మీదుగా దూసుకెళ్లింది. నన్ను బెదరగొట్టాలని అది, అదలా దూసుకొస్తున్నప్పుడు నాకు అతి దగ్గరగా దాని రెక్కల్లో విచ్చుకున్న  నీలి వర్ణాలకు స్థానువునై  నేను... అరగంటసేపు సాగింది మగ పాలపిట్ట రెక్కల ప్రదర్శన. ఆడ పాలపిట్ట అందడం లేదు దానికి. గోల నచ్చలేదేమో ఆ చెట్టు మీదే ఉండే  గుడ్లగూబ తరిమి కొట్టింది రెండిట్లో ఒకదాన్ని. అప్పటివరకూ చెట్లుమారిన గోల ఇక సద్దుమణిగింది.


మగ పాలపిట్ట ఆడ పాలపిట్ట రెండూ ఒకేలా కనిపిస్తాయి. మెడ పొట్ట భాగం ముదురు గోధుమ రంగులో ఉంది తెల్లటి గీతలుంటాయి. తల పైన భాగం రెక్కలు లేత నీలం ముదురు నీలం రంగుల్లో ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఈ పక్షిని  నీలకంట అనికూడా అంటారు.  వీటి  అరుపు అంత వినసొంపుగా ఉండదనిపిస్తుంది. కొద్దిగా కాకి అరుపుని పోలి ఉంటుంది. ప్రత్యుత్పత్తి సమయంలో గోల గోలగా ఉంటాయి పాలపిట్ట అరుపులు.


పాలపిట్ట /Indian Roller (Coracias benghalensis). Blue Jay అనికూడా అంటారు దీనిని. మన దేశం లో ఎక్కువగా కనిపించే పాలపిట్ట ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒరిస్సా , బీహారు  రాష్ట్రాలకు రాష్ట్ర పక్షి.  చెట్టు ఎండు కొమ్మల్లో, విద్యుత్తు తీగలూ మీద కనిపించే పాలపిట్టలు ఆహారంగా కప్పలు, చిన్న పాములు, మిడతలు కీచురాళ్ళు లాంటి వాటిని వేటాడతాయి. పంటపొలాలు ఉన్న చోట తరచుగా కనబడుతుంటాయి పాలపిట్టలు.  వీటి జీవిత కాలం 17-20 సంవత్సరాలు. చెట్ల తొర్రల్ని గూళ్ళు గా మలచుకుని 3-5 గుడ్లు పెడతాయి. గుడ్లను పొదగడంలో ఆడ పక్షి మగ పక్షి రెండూ బాధ్యత తీసుకుంటాయి. వీటి ప్రత్యుత్పత్తి కాలం అవి నివసించే ప్రాంతాలను బట్టి ఫిబ్రవరి నుండి జూన్ వరకూ ఉంటుంది. 

శుభం జరగాలని దసరా నాడు పాలపిట్టని చూడాలంటారు కొన్ని ప్రాంతాల్లో.  బంధించి ప్రదర్శనకు పెడుతున్నారీ మధ్య!

సంవత్సరం క్రితం వరకూ పాలపిట్ట ఎలా ఉంటుందో నాకూ తెలియదు. ఇప్పుడు దాదాపుగా రోజూ చూస్తున్నాను. 


Pages